తెరపైన ఫైట్లు, బిల్డప్పులు, డ్యాన్సులు ఇరగదీసేవాడే హీరో. కానీ రాను రాను ఆ అభిప్రాయాలు మారిపోతున్నాయి. తెరపైన డూపులతో చించేస్తాం అనేవాళ్లకంటే తెరవెనుక కూడా హీరోల్లాగే ఉండేవాళ్ళకే ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది. అందుకే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌కి టాప్ రేంజ్‌లో క్రేజ్ ఉంది. దంగల్ సినిమాలో తెరపైన అమీర్ చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌కి తెరవెనుక బరువు తగ్గడం, పెరగడం కోసం అమీర్ చేసిన కష్టం తాలూకూ హీరోయిజం ఏ మాత్రం తగ్గదు. బాహుబలి సినిమాతో బాలీవుడ్ స్థాయికి ఎదిగిన మన ప్రభాస్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నాడు.
హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, విక్రమ్‌లలాగే క్యారెక్టర్స్ కోసం ఎంత కష్టమైనా పడడానికి రెడీ అని అంటున్నాడు. ఆల్రెడీ బాహుబలి సినిమాతోనే ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. కత్తి యుద్ధాలు నేర్చుకున్నాడు, డూప్ వర్క్ పెద్దగా లేకుండా ప్రభాస్ పడిన కష్టం మొత్తం కూడా మనకు మేకింగ్ వీడియోస్‌లో కనిపించింది. ఇప్పుడు బాహుబలి తర్వాత వచ్చే సినిమాల కోసం కూడా అదే రేంజ్‌లో కష్టపడాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. అందుకే తన తర్వాత సినిమా కోసం 20 కిలోలు బరువు తగ్గడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సన్నిహితులు కూడా అంత రిస్క్ అవసరమా అని చెప్తున్నప్పటికీ ప్రభాస్ మాత్రం కష్టపడడానికే రెడీ అయ్యాడు. బాహుబలితో తనకు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మార్కెట్స్‌లో ఏర్పడిన స్పెషల్ క్రేజ్‌ని నిలబెట్టుకోవాలంటే అమీర్ ఖాన్, హృతిక్, విక్రమ్‌ల లాగే కష్టపడక తప్పదని అనుకుంటున్నాడు ప్రభాస్. సినిమా విశ్లేషకులు, అభిమానులు మాత్రం ప్రభాస్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. తెలుగు హీరోలు కూడా క్యారెక్టర్స్‌లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం తెరవెనుక కూడా కష్టపడడానికి రెడీ అవుతుండడం వాళ్ళని సంతోషపెడుతోంది.