Megastar Chiranjeevi’s landmark 150th movie ‘Khaidi No 150’ is going to create alltime record with Humongous release in all areas.
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత తన ల్యాండ్‌మార్క్ ‘ఖైదీ నెంబబర్ 150’తో వెండితెరపై రీఎంట్రీ ఇస్తుండడంతో.. తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే.. ఈ చిత్రం గతంలో ఏ మూవీ సాధించని రికార్డుల్ని కొల్లగొడుతోంది. తొలుత ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళిన కొత్తలో దీనిపై అంత బజ్ లేదు. పైగా.. తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.. సెటైర్లు కూడా పడ్డాయి. కానీ.. కాలక్రమంలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. ఇప్పుడైతే ఈ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. దీంతో ఈ చిత్రం రికార్డులు నెలకొల్పుతోంది.
ఇప్పటికే ఈ సినిమా రూ.103 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి టాలీవుడ్‌నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ దెబ్బకు నిర్మాతలకు ఊహించని రేంజులో టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇక రిలీజ్ పరంగా ఈ సినిమా ఏకంగా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. కేవలం ఒక్క కర్ణాటకలోనే ఈ సినిమాని 220 స్ర్కీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ ఏరియాలో అన్నేసి స్ర్కీన్స్‌లో ఏ ఒక్క తెలుగు చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. ఆ ఒక్క ఏరియాలోనే కాదు.. ఈస్ట్ గోదావరిలో 46 సెంటర్లలోనూ, వెస్ట్ గోదావరిలో 36 సెంటర్లలోనూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ‘బాహుబలి’ సినిమాని కూడా ఆ రెండు ఏరియాల్లో అన్ని స్ర్కీన్స్‌లో విడుదల చేయలేదు. ఇంకా చాలా ఏరియాల్లో కూడా భారీఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది.
భారీ రేట్లకు ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకోవడంతో.. అత్యధిక వసూళ్లు రాబట్టాలనే ఆశయంతో ఇన్ని థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడబోతే.. ఈ చిత్రం తొలిరోజు ‘బాహుబలి’ని సైతం బీట్ చేసి, సంచలన కలెక్షన్లు రాబట్టడం ఖాయంలా కనిపిస్తోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ బ్యానర్‌పై నిర్మించగా.. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన రిలీజ్ కానుంది.