TSR foundation to give Yash Chopra 4th national award to Bollywood King Shahrukh Khan in Mumbai on February 25.
సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు ‘యశ్ చోప్రా’ 4వ జాతీయ అవార్డును ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్.ఫౌండేషన్ అధ్యక్షులు డా.టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పమేలా చోప్రా (దివంగత యశ్ చోప్రా సతీమణి), పద్మిని కొల్హాపురి, బోనీకపూర్‌లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్ చోప్రా 4వ జాతీయ అవార్డుకుగాను షారూక్‌ను ఎంపిక చేసింది.
యశ్ చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును డా. టి. సుబ్బరామిరెడ్డి ‘టి.ఎస్.ఆర్. ఫౌండేషన్’ పేరుపై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతాకం, ప్రసంశా పత్రంను అవార్డు గ్రహీతకు అందించనున్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబైలోని హోటల్ మారియట్‌లో జరిగే వేడుకలో ఈ యశ్ చోప్రా 4వ జాతీయ అవార్డును షారూక్ ఖాన్‌కు అందించనున్నట్లు డా. టి. సుబ్బరామి రెడ్డి తెలిపారు.
గతంలో ఈ అవార్డును సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని లత మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖలు అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర సినీ నటులు ఈ అవార్డు వేడుకలో పాల్గొననున్నారు.