Here it is the exclusive review of Ram Gopal Varma’s latest sensation Vangaveeti which is based on Vijayawada factionism. Sundeep Kumar played bother Radha and Ranga roles. Naina Ganguly seen as rathna kumari.
సినిమా : వంగవీటి
తారాగణం: సందీప్‌కుమార్, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్, వంశీ చాగంటి, తదితరులు
స్టోరీ – స్ర్కీన్‌ప్లే – దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
ప్రొడ్యూసర్ : దాసరి కిరణ్‌కుమార్
మ్యూజిక్ : రవిశంకర్
సినిమాటోగ్రఫర్స్ : రాహుల్ శ్రీవాత్సవ, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి
ఎడిటర్ : సిద్ధార్థ రాతోలు
బ్యానర్ : శ్రీ రామదూత క్రియేషన్స్
రిలీజ్ డేట్ : 23-12-2016
నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా తెరకెక్కించడంలో దిట్ట అయిన సంచలన దర్శకుడు రాంగోపాల్.. తాజాగా ‘వంగవీటి’ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా మూవీ రూపొందించాడు. విజయవాడ వర్గాలూ, అక్కడి కక్షలను స్పృశిస్తూ ఈ మూవీని తీశాడు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారడంతో.. దీనికి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక గతంలో మునుపెన్నడూలేని విధంగా ఈ మూవీని వర్మ విస్తృతంగా ప్రచారం చేయడంతో.. దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందామా..
కథ :
విజయవాడలో పేరుగాంచిన రౌడీ వెంకటరత్నం నీడలో రాధా (సందీప్ కుమార్) ఎదుగుతాడు. అయితే.. వెంకటరత్నం తనని తప్పుగా అర్థం చేసుకొని, అవమానించడంతో.. వెంకటరత్నంని రాధా చంపేస్తాడు. దాంతో.. విజయవాడ మొత్తం అతని చేతుల్లోకి వచ్చేస్తుంది. అదే టైంలో.. కళాశాలలో చదువుకొంటున్న గాంధీ (కౌటిల్య), నెహ్రూ (శ్రీతేజ్) సోదరులు రాధాకి దగ్గర అవుతారు. కాలేజ్‌లో తమకంటూ ఓ వర్గం ఉండాలని వాళ్లు సూచించగా.. ‘యునైటెడ్ ఇండిపెండెన్స్’ రాధా ఓ యూనియన్‌ని స్థాపిస్తాడు. కొన్నాళ్ల తర్వాత ప్రత్యర్థుల చేతుల్లో రాధా హత్యకి గురవుతాడు.
దీంతో.. అనుచరులంతా రాధా స్థానాన్ని ఆయన తమ్ముడు రంగా (సందీప్‌కుమార్)కి కట్టబెడతారు. ఇంతలో గాంధీ, నెహ్రూలతో రంగాకి విభేదాలు ఏర్పడతాయి. అవి తారస్థాయికి చేరడంతో.. గాంధీ, నెహ్రూలు కాలేజ్‌లో మరో కొత్త యూనియన్‌ని స్థాపిస్తారు. ఈ క్రమంలోనే రంగా అనుచరుల చేతిలో గాంధీ హత్యకి గురవుతాడు. గాంధీ హత్యకి ఆయన చిన్న తమ్ముడు మురళి (వంశీ చాగంటి) ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? నెహ్రూ తన కుటుంబం కోసం, వర్గం కోసం ఏం చేశాడు? రౌడీ స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన రంగా ఎలా హత్య చేయబడ్డాడు? అనేవి తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాంగోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్నాడంటే.. అది ఏదో ఓ వివాదానికి దారితీస్తుందనే భావన నెలకొంటుంది. ఈసారి ‘వంగవీటి’లాంటి మరో రియల్ లైఫ్ స్టోరీతో సినిమా తీయడంతో.. ఈ చిత్రాన్ని వెండితెరపై వర్మ ఎలా చూపిస్తాడు? ఇందులో వివాదాస్పదమైన అంశాలేమైనా జోడించాడా? లేదా? అనే ఆతృత ప్రతిఒక్కరిలోనూ నెలకొంది. అయితే.. వర్మ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించాడు. వివాదాస్పదమైన విషయాల జోలికి వెళ్లలేదు. కులాలూ, పార్టీల ప్రస్తావన పెద్దగా తీసుకు రాలేదు. విజయవాడ రౌడీ రాజకీయం ఎలా మొదలైంది? అందులో వెంకటరత్నం పాత్ర ఎంత ఉంది? ఆయన నీడలో రాధా ఎలా ఎదిగాడు? వాళ్లిద్దరి హత్యలు ఎలా జరిగాయి? ఏ పరిస్థితుల్లో రాధా తమ్ముడు రంగా తన వర్గానికి నాయకత్వం వహించాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా వర్మ చెప్పాడు.
ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. వర్మ మార్క్ సన్నివేశాలూ, భావోద్వేగాలతో సాగిపోతుంది. మొదట్లో కాస్త స్లోగా నడిస్తే.. రంగా రాజకీయ ప్రవేశంతో వేగం పుంజుకుంటుంది. వెంకటరత్నం, రాధా, గాంధీ హత్యలు.. ఆ వెనుక పరిణామాల్ని తారాస్థాయిలో వర్మ చూపించాడు. తనదైన స్టైల్‌లో వాటిని తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. కానీ.. ఫస్టాప్‌లో సీన్లను ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించాడో సెకండాఫ్‌లో అలా తీర్చిదిద్దలేకపోయారు వర్మ. కీలకమైన కథ సెకండాఫ్‌లో ఉన్నప్పటికీ.. తొలి సగభాగం కథలా మాత్రం ఆసక్తి రేకెత్తలేదు. రంగా హద్య ఉదంతంతోనే సినిమాని ముగించేశారు. నిజానికి.. రంగా హత్యానంతరం ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. అవి విదానానికి దారితీస్తాయనో లేక మరో కారణమో తెలీదు కానీ.. రంగ హత్యతో కథని ముగించారు.
ఆనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ఎంతో సహజంగా ఈ చిత్రాన్ని వర్మ తీర్చిదిద్దాడు. అలాగే పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకొన్న విధానం కూడా చాలా బాగుంది. కథలో ప్రతి హత్యకీ కారణమేంటన్నది స్పష్టంగా చూపించారు కానీ.. రంగా హత్యకి కారకులెవరన్నది మాత్రం బయట పెట్టలేదు. తనదైన మార్క్ సెటైర్‌తో సినిమాని వర్మ ముగించడం కొసమెరుపు.
నటీనటుల పనితీరు :
రాధా, రంగా పాత్రల్లో నటించిన సందీప్‌కుమార్ అద్భుతమైన నటన కనబరిచాడు. రెండు పాత్రల్లోనూ చాలా బాగా ఒదిగిపోయాడు. ఆ పాత్రలకు అతను తప్ప మరెవ్వరూ సెట్ అవ్వరు అనేంతగా జీవించేశాడు. గాంధీ, నెహ్రూ, మురళి పాత్రలు కూడా వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటాయి. రత్నకుమారిగా నైనా గంగూలీ చాలా బాగా నటించింది. మిగతా నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక పనితీరు :
సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మేజర్ హైలైట్‌గా నిలిచింది. కథ మూడ్‌కి తగ్గట్లుగా తమ కెమెరా పనితనం చూపించారు. చాలా సహజంగా చూపించడంలో తమ ప్రతిభని చాటిచెప్పారు. సంగీతం కూడా బాగానే ఉంది. ముఖ్యంగా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలకు ఎక్కడా వంకా పెట్టడానికి లేదు. ఇక రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడితే.. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకుండా కథని ఆసక్తికరంగా మలిచి ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఫస్టాఫ్‌లాగా సెకండాఫ్‌ని ఇంట్రెస్టింగ్‌గా తీర్చదిద్దలేకపోయాడు. దానిపై కాస్త శ్రద్ధ పెట్టి వుండుంటే బాగుండేది.
ఫైనల్ వర్డ్ : వర్మ మార్క్ సినిమా.
‘వంగవీటి’ మూవీ రేటింగ్ : 3/5