Finally Mohanlal’s latest sensation Manyam Puli hits telugu screen on 02-12-2016. Read the below review to know how is this movie.
సినిమా : మన్యంపులి
నటీనటులు : మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ, జగపతిబాబు, నమిత, తదితరులు
డైరెక్టర్ : వైశాక్
ప్రొడ్యూసర్ : సిందూరపువ్వు కృష్ణారెడ్డి
మ్యూజిక్ : గోపీసుందర్
సినిమాటోగ్రఫీ : షాజికుమార్
ఎడిటర్ : జాన్ కుట్టి
బ్యానర్ : సరస్వతిఫిలిమ్స్
రిలీజ్ డేట్ : 02-12-2016
‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తెలుగు ఆడియెన్స్‌కి చేరువవడంతో.. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘పులిమురుగన్’ని తెలుగులో డబ్ చేసి, ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం కేరళలో రూ.125 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించడంతో.. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందన్న ఉద్దేశంతో రిలీజ్ చేశారు. పైగా.. ఇందులో జగపతిబాబు కూడా ఉండడంతో వారికి కలిసొచ్చింది. ఇక ఈమధ్యే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్‌కి అనూహ్య స్పందన రావడంతో.. దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. వాటిని ఈ చిత్రం అందుకుందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..
కథ : పులి కుమార్ (మోహన్‌లాల్) కుటుంబం ‘పులియూర్’ వన్యప్రాంతంలో బతుకుతుంటుంది. పులికుమార్‌కి సుబ్రమణ్యం అనే తమ్ముడు ఉంటాడు. పులికుమార్ తన చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి అతని కళ్లెదుటే తండ్రిని ఓ పెద్ద పులి తినేస్తుంది. దాంతో.. తీవ్ర ఆగ్రహానికి గురై ఆ పులిని ఎలాగైనా చంపేయాలని అనుకుంటాడు. చివరికి ఓ పథకం వేసి.. చిన్న వయసులోనే ఆ పులిని మట్టుబెడతాడు పులికుమార్. అనంతరం.. అడవిలో ఉండే పులియూరుకి పులుల బెడద రాకుండా కాపాడుతుంటాడు. అనాథ అయిన మైనా (కమలిని ముఖర్జీ)ని పెళ్ళి చేసుకుని, జీవితం కొనసాగిస్తుంటాడు.
కట్ చేస్తే.. తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు సుబ్రమణ్యంకి ఉద్యోగం ఇస్తామని ఇద్దరు స్నేహితులు ఆశచూపి.. కుమార్ కుటుంబాన్ని సిటీకి తీసుకెళ్తారు. అక్కడ డాడీ గిరిజ (జగపతిబాబు)కి చెందిన ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు. అయితే.. డాడీ గిరిజ కంపెనీ ఆయుర్వేద మందులు తయారు చేయడం లేదనీ, అదో మత్తు మందుల కంపెనీ అని పులి కుమార్‌కి తెలుస్తుంది. మరోవైపు.. పులికుమార్‌ని చంపేందుకు డాడీ గిరిజ చంపుతుంటాడు? అసలు ఈ డాడీ గిరిజ ఎవరు? అతడు ఎందుకు పులికుమార్‌ని చంపాలనుకుంటాడు? డాడీ గిరిజ కంపెనీ మత్తు పదార్థాల తయారు చేస్తుందని తెలుసుకుని పులికుమార్ ఏం చేశాడు? మధ్యలో జూలీతో పులికుమార్‌కి ఉన్న సంబంధం ఏంటి? అసలు సుబ్రమణ్యం ఏమయ్యాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.
విశ్లేషణ : అడవి నేపథ్యంలో సాగే ఈ మాస్ చిత్రం.. మొదటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరో ఎంట్రీ అవ్వకముందు నుంచే ప్రేక్షకులు కథలో లీనమవుతారు. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ చిత్రానికి విజువల్సే ప్రధాన బలం. వాటిని వెండితెరపై ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన విధానం బాగుంది. మధ్యలో స్టోరీ కాస్త నెమ్మదించినప్పటికీ.. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ మూవీ ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.
ఇక స్టోరీ విషయానికొస్తే.. ప్రారంభం నుంచే ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. తొలి 20 నిముషాల్లోనే హీరోయిజంతోపాటు.. విలనిజం కూడా పండడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. మోహన్‌లాల్ తెరపై కనిపించడం.. ఆయన ఓ పులిని మట్టుబెట్టే సన్నివేశాల వరకు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే.. ఆ తర్వాత కథ కాస్త నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఓ ఫ్యామిలీ డ్రామాలా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. అది సెకండాఫ్ మీద మరింత ఆసక్తి రేపుతుంది. మొదట్లో రెండో భాగం ఆసక్తికరంగానే సాగుతుంది కానీ.. ఆ తర్వాత కథ మళ్ళీ నత్తనడకలా నడుస్తుంది. కొన్ని సీన్లు బోర్ కొట్టించేస్తాయి. ఇక చివరి 30 నిముషాలు మాత్రం స్టోరీ మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్‌గా టర్న్ తీసుకుంటుంది. ఆ ఎపిసోడ్‌లో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. సినిమాని ముగించిన తీరు బాగుంది.
ఓవరాల్‌గా చెప్పుకుంటే.. మొదటి 30 నిముషాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, చివరి 30 నిముషాలే ఈ సినిమాకి కీలకం. అవి ఆడియెన్స్‌ని ఆద్యంత కట్టి పడేస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన కొన్ని ఎఫిసోడ్స్ భలే కిక్ ఇస్తాయి. అవి ఎంతో సహజంగా అనిపిస్తాయి. మధ్యలో సాగే డ్రామానే అంతగా ఆకట్టుకోదు. ఫ్యామిలీ ఎపిసోడ్స్ బోరింగ్‌గా అనిపించాయి. అలాగే సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉంది.
నటీనటుల పనితీరు : మోహన్‌లాల్ ఈ సినిమాలో తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. పులికుమార్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన చూపులు, నటన, యాక్షన్ నిజంగానే అమోఘం. సెంటిమెంట్ సన్నివేశాల్లోనూ బాగా నటించారు. ఆయన నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే. హీరోయిన్ కమిలినీ ముఖర్జీ కూడా అద్భుత అభినయం ప్రదర్శించింది. మేకప్ లేకుండా చాలా సహజంగా నటించింది. డాడీ గిరిజ పాత్రలో జగపతిబాబు నటన ఆకట్టుకుంటుంది. మరోసారి తన విలనిజంతో జగ్గూ భాయ్ మెప్పించాడు. ఇక నమిత పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. నాలుగైదు సన్నివేశాల్లో ఇలా కనిపించి అలా మాయమైపోతుందంతే. ఉన్నంతలో అమ్మడు బాగానే నటించింది. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక పనితీరు : ఈ చిత్రానికి షాజికుమార్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో గ్రాండ్‌గా చూపించాడు. ముఖ్యంగా.. అడవి అందాల్ని చాలా అద్భుతంగా చూపించాడు. ఆయన కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. గోపీసుందర్ అందించిన సంగీతం కూడా బాగుంది. అది ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. నేపథ్య సంగీతం సూపర్బ్. పీటర్ హెయిన్స్ తీర్చిదిద్దిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి మరింత కీలకం. పులి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. నిజమైన పులితో పోరాడినట్టే వాటిని తీర్చిదిద్దారు. ఇక దర్శకుడు గురించి మాట్లాడితే.. అతను ఎంచుకున్న కథ, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మార్చటంలో అతడు సఫలమయ్యారు. అయితే.. మధ్యలో సాగదీయకుండా ఉండాల్సింది.
చివరగా : ఈ ‘మన్యం పులి’ ఊర మాస్ గురూ!
‘మన్యం పులి’ రేటింగ్ : 2.75/5