Newsచరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. సెహ్వాగ్ తర్వాత అతడే!

చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. సెహ్వాగ్ తర్వాత అతడే!

Indian young batsman creates history by doing 300 runs against England. He is the second player of Indian to hit 300 after Virender Sehwag.

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అనే డైలాగ్‌కి తగ్గట్టుగా టీమిండియా ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. టీమిండియా 2015-వరల్డ్‌కప్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం పాలైనప్పుడు.. ఒకప్పుడు సెహ్వాగ్, సచిన్‌లాంటి గొప్ప ఆటగాళ్లు ఉండేవారని చెప్పుకున్నారు. ఇప్పుడు వారిని మరిచిపోయేలా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. నిన్నటిదాకా విరాట్ కోహ్లీ ప్రభంజనం సృష్టిస్తే.. తాజాగా ఓ యంగ్ క్రికెటర్ హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అతడే కరుణ్ నాయర్.

నిన్నటిదాకా ఈ పేరుతో ఎవరికీ అంతగా పరిచయం లేదు. ఇతను బ్యాట్ పట్టుకుని క్రీజులో దిగాక.. యావరేజ్ పెర్ఫార్మెన్స్‌తోనే వెనుదిరుగుతాడులే అని భావించారు. కానీ.. ఇతని విధ్వంసక బ్యాటింగ్ చూసి యావత్ ప్రపంచం ఖంగుతింది. అతని ప్రదర్శన చూస్తే.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాగా ప్రిపేర్ అయినట్లున్నాడు.. అలా దంచేశాడు మనోడు. ఒక్క మ్యాచ్‌తోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. తొలుత 100 పరుగులు చేయడానికి కాస్త సమయం తీసుకున్న ఆ ఆటగాడు.. ఆ తర్వాత రప్ఫాడించేశాడు. పరదేశ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. దిగ్గజ క్రికెటర్లు ఎందరికో సాధ్యం కాని ట్రిపుల్ సెంచరీ ఘనతను మూడో టెస్టులోనే అందుకున్నాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 391/4తో నాలుగో రోజు, సోమవారం బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా దీటుగా ఆడింది. మురళీ విజయ్‌ (29) వెనుదిరిగే సరికి జట్టు స్కోరు 435/5. ఇలాంటి స్థితిలో కరుణ్‌నాయర్‌ రెచ్చిపోయాడు. 185 బంతుల్లోనే టెస్టుల్లో తొలి శతకం నమోదు చేశాడు. అశ్విన్‌ (67) పెవిలియన్‌కు చేరిన తర్వాత కరుణ్ మరింత రెచ్చిపోయాడు. చక్కని స్వీప్‌ షాట్స్, పుల్‌ షాట్లు, రివర్స్‌స్వీప్‌ షాట్లతో.. 124 బంతుల్లో మరో 100 పరుగులు రాబట్టి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు జడేజా భారీ షాట్లు ఆడుతూ ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆడుకోగా.. మరోవైపు కరుణ్‌ విజృంభించాడు. చివరికి 72 బంతుల్లోనే మరో 100 పరుగులు చేసి.. సగర్వంగా.. ‘త్రిశతకం’ సాధించాడు. మొత్తం 381 బంతులు ఆడిన కరుణ్‌ 32 బౌండరీలు, 4 సిక్సర్లు బాదాడు. ఇతని విధ్వంసక ఇన్నింగ్స్ వల్లే టెస్టుల్లో భారత్‌ అత్యధిక స్కోరు 759/7 సాధించేందుకు కీలకంగా మారింది. ఈ విధంగా ఇంగ్లాండ్‌పై త్రిపుల్ సెంచరీ బాదిన కరుణ్.. మరికొన్ని రికార్డులను సైతం తన ఖాతాలో లిఖించుకున్నాడు.

1. డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (2008లో దక్షిణాఫ్రికాపై 319, 2004లో పాకిస్థాన్‌పై 309 పరుగులు) తర్వాత 300 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
2. అత్యధిక పరుగుల తొలి శతకం బాదిన గారీ సోబర్స్‌ (365 నాటౌట్‌), సింప్సన్‌ (311) తర్వాతి స్థానంలో నిలిచాడు.
3. ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గాను రికార్డు సృష్టించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news