Megastar Chiranjeevi shows excellent skills at the age of 60 for his latest prestigeous project Khaidi No 150.
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి చిరంజీవి మళ్ళీ ఎప్పుడూ ముఖానికి రంగు పూసుకోలేదు. పూర్తిగా పాలిటిక్స్‌లోనే నిమగ్నమైపోవడంతో.. తిరిగి ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఒకానొక సమయంలో చిరు ఇక సినిమాల్లోకి రానని వెల్లడించడంతో.. మెగాఫ్యాన్స్ ఆయనపై ఆశలు పెట్టుకోవడం మానేశారు. కానీ.. మూడేళ్ల కిందట చిరు సడెన్ షాక్ ఇచ్చారు. తాను మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నానని ప్రకటన చేసి.. ఫ్యాన్స్‌లో ఆనందం నింపారు. అప్పటినుంచి తమ అభిమాన నటుడు తిరిగి వెండితెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అంటూ వెయిట్ చేస్తూ వచ్చారు.
అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో చిరు కాస్త లావుగా అవడంతోపాటు గ్లామర్ కూడా తగ్గింది. ఆయన ఫిజిక్ ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? ఇంతకీ ఇప్పటి మాస్ సినిమాలకు సరిపోతుందా? అనే అభిప్రాయాలు వెలువడ్డాయి. 60 ఏళ్ల పైబడిన చిరు.. తన ఫిజిక్‌ని ఫిట్‌గా మార్చుకోవడం ఆషామాషీ విషయం కాదని అనుకున్నారు కూడా. పైగా.. ఫేస్‌లో ఆ ‘కళ’ కూడా లేకపోవడంతో.. గ్రాఫిక్స్‌తోనే పనికానివ్వాల్సి వస్తుందని కామెంట్స్ వినిపించాయి. మునుపటి మెగాస్టార్ కనిపించడం కష్టమేనని ఇండస్ట్రీ జనాలు సైతం మాట్లాడుకున్నారు. కానీ.. ఈ కామెంట్స్‌కి ధీటుగా సమాధానం ఇస్తూ చిరంజీవి తిరిగి యంగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. 60 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కనిపించి.. ఔరా అనిపించారు.
అంతేకాదు.. గతంలో ఉన్న ఎనర్జీనే సినిమాలోనూ చూపించారు. తన ప్రతిష్టాత్మక 150 మూవీలో డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్‌లో నటించారు. డ్యాన్స్‌లోనూ ఇరగదీశారు. ఇందుకు నిదర్శనం.. టీజర్, ఫోటోలు, లీకైన వీడియోలే. వాటిల్లో యూత్‌లా కనిపిస్తూ.. యాక్షన్ సీన్స్‌లో రౌద్రుడిలా, పాటల్లో డ్యాన్స్ మాస్టర్‌లా కనువిందు చేశారు. ఇలా తనని తాను 25 ఏళ్ల యువకుడిలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడంతోపాటు అదే ఎనర్జీని కనబరచడంలో గ్రేట్ అనిపించుకున్నారు చిరు. ఇంతగా చిరు కష్టపడతారు కాబట్టే.. జనాలు ఆయన్ను ‘మెగాస్టార్’గా అభివర్ణిస్తారు.