ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నిజాయితీగా వుండాలనే ఓ చక్కని మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగుల కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ‘హైపర్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ప్రదర్శన అనంతరం ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ – ”ప్రభుత్వ ఉద్యోగం అంటే నెల జీతం తీసుకోవడం, చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోవడం, డబ్బు చేసుకోవడం కాదు. ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడమంటే ప్రజల పట్ల బాధ్యత వహించడం, నిబద్ధతతో నిలబడడం. ఒక ఉద్యోగి పెట్టే సంతకానికి ప్రజల జీవితాలు ముడిపడి వుంటాయనే సందేశంతో ‘హైపర్’ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది” అన్నారు.
ఎన్జీఓ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్ మాట్లాడుతూ – ”ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా వుంటే ఎలాంటి కష్టాలు వస్తాయి, ఆ కష్టాల్ని తప్పకుండా జయిస్తారనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా ‘హైపర్’ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సంతకం ఎంత గొప్పది, అది సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి వ్యవస్థల పట్ల విశ్వాసం వుండాలి కానీ వ్యక్తుల పట్ల కాదు అనేది చూపిస్తే బాగుండేది” అన్నారు.
ఎన్జీఓ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”నిజాయితీగా వుండే ఉద్యోగికి ఎలాంటి కష్టాలు వస్తాయనేది ‘హైపర్’ చిత్రంలో చాలా చక్కగా చూపించారు. నిత్యం ఇది మనం చూస్తున్నదే అయినా దాన్ని ప్రజలందరికీ చేరేలా సినిమాలో చూపించడం అనేది గొప్ప విషయం. ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం వుంది. ఈ చిత్రాన్ని ప్రతి ఉద్యోగి చూడాల్సిన అవసరం వుంది. ‘హైపర్’ చిత్రం ఉద్యోగులకు మార్గదర్శకంగా వుంటుంది” అన్నారు.
ఎన్జీఓ నగర అధ్యక్షులు ప్రతాప్ మాట్లాడుతూ – ”తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ప్రతి అంశాన్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. పట్టుదలతో అన్ని పనులు చేస్తున్నా కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడి వల్ల ప్రభుత్వ ఉద్యోగి వెనుకబడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మ స్థయిర్యంతో ఉద్యోగులంతా పనిచేయాలనే చక్కని సందేశంతో హైపర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకనిర్మాతలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్‌వాస్.