హైదరాబాద్ పేరు తూటాల రూపంలో గాల్లోకి దూసుకెళ్తోంది. అప్పుడప్పుడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడపడితే అక్కడ తుపాకులు పేల్చొచ్చు. అదేంటి కొత్తగా ఏమైనా పర్మీషన్ ఇచ్చారా..? అనుకుంటున్నారా..? అదేం లేదు మీరు భయపడకండి.
ఇన్ని రోజులు హైదరాబాద్ పేరు చెప్పగానే ఎవరికైనా బిర్యానీ, ఇరానీ ఛాయ్ గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు తుపాకీ తూటాల సౌండ్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈ నెల 22 మోసిన్ అనే ఓ యువకుడు పెళ్లి బరాత్ లో తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. అప్పుడెప్పుడో జరిగిన విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారని విచిత్రంగా ఫేస్ పెట్టకండి. ఎందుకంటే.. అది మన పోలీసుల గొప్పదనం. కాల్పులు జరిగి వారం రోజులైనా తమకేం తెలియనట్టు కూర్చుకున్నారు. ఎవరో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో హడావుడిగా కొత్తపెళ్లికొడుకును లోపలేశారు. అది డమ్మీ తుపాకి అని.. డేంజర్ ఏం లేదని చెబుతున్నారు.
మొన్నీమధ్యే సిటీలో పేలుళ్లకు కుట్ర చేసిన ఉగ్రవాదులను ఓల్డ్ సిటీలోనే NIA అరెస్ట్ చేసింది. మన పోలీసులకు కనీసం ఆ వాసన కూడా తెలియలేదు. ఇప్పుడు ఓ తుపాకీ పేలినా పదిరోజుల దాకా.. అంతా సైలెంట్. అంటే భద్రత ఎంత పకడ్భందీగా ఉందో.. దీన్ని బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అది డమ్మీ తుపాకే అనుకుందాం. కాల్పులు జరిగి పది రోజులైనా పోలీసులకు విషయం తెలియలేదా..? ఒకవేళ తెలిసినా.. లైట్ తీసుకున్నారా..? అనేది ఆ దేవుడికే తెలియాలి.