తెలుగు మీడియాకు జనం సమస్యలు పట్టవా..?
మీడియా అంటే ఎవరైనా ఏమనుకుంటాం. జనం సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్తుంది. పాలకుల అవినీతిని బయటపెడుతుంది. ఇంకా ఎన్నో.. ఎన్నో. కానీ నిన్న బేగంపేట సీఎం సభ సందర్బంగా మీడియా తీరు చూస్తే.. వీళ్లకు జనం సమస్యలు పట్టవేమో అన్పిస్తోంది.
ప్రాజెక్టుల ఒప్పందాలు పూర్తి చేసుకుని రాష్ట్రానికొచ్చిన సీఎంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది టీఆర్ఎస్. ఇందుకోసం ఉదయం నుంచే బేగంపేటను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వేలాదిమందిని బేగంపేటకు తరలించారు. ఇదే సిటీ వాసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఉదయం మొదలైన కష్టాలు.. సాయంత్రానికి పీక్ కు చేరాయి. సీఎం రాగానే ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆపేశారు. దీంతో గంటలతరబడి రోడ్లపైనే వెయిట్ చేశారు ప్రజలు.
సీఎం భజనలో మునిగిపోయిన తెలుగు మీడియా..
అయితే సీఎం భజనలో మునిగిపోయిన తెలుగు మీడియాకు సామాన్యుల కష్టం కనబడలేదు. పోటీలుపడి గంటలతరబడి సీఎం లైవ్ తోనే ఊదరగొట్టారు. ప్రాజెక్టుల చరిత్ర చెబుతూ తరించిపోయారు. కానీ ఒక్కటంటే ఒక్క చానల్ కూడా సామన్యప్రజల కష్టాలను చూడలేకపోయింది. వీళ్ల బాధలు వాళ్లకు తెలీకకాదు. ప్రసారం చేస్తో ఏమౌతుందోననే భయం. ఎలక్ట్రానిక్ మీడియాను కాసేపు పక్కన పెడదాం. ప్రింట్ మీడియాకు ఏమైంది. ఇవాళ ఒక్క పేపర్ లోనైనా ట్రాఫిక్ కష్టాల వార్త వచ్చిందా. కనీసం సింగిల్ కాలమ్ ఐటమ్ కూడా ఇవ్వలేదు.
నిజానికి నిన్న సీఎం వచ్చాక బేగంపేట, ఆర్పీ రోడ్, ప్యాట్నీ లాంటి ప్రాంతాల్లో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే గంటలకొద్ది ఆగిపోయింది. పోలీసులు, మీడియా ప్రభుత్వ సేవలో మునిగిపోవడంతో జనానికి కష్టాలు తప్పలేదు. గుడ్డిలోమెల్ల అన్నట్లు ఇంగ్లీష్ పేపర్లు జనం కష్టాలను వార్తలుగా ఇచ్చాయి. మరి మన తెలుగు మీడియాకు ఈ బుద్ది ఎప్పుడొస్తుందో..