తిరుపతి జనసేన మీటింగ్ లో అన్నిపార్టీలను ఉతికారేశారు పవన్ కళ్యాణ్. తానేవరికి భజనం సంఘం కాదంటూ.. జనం కోసమే పార్టీ పెట్టానన్నారు. మీటింగ్ లో ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ పైనే కాన్సన్ ట్రేట్ చేశారు. విభజన దగ్గర నుంచి ఇప్పటివరకు పార్టీల తీరు.. నేతల ప్రవర్తనను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇన్నాళ్లు ప్రశ్నించలేదు ప్రశ్నించలేదు అనేవారిని తన ప్రశ్నలతో కడిగిపారేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీల తీరును ప్రశ్నించారు. ఈ రెండేళ్ల నుంచి ఏం చేస్తారో చూద్దామని వెయిట్ చేశానని.. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఉండకూడదన్నారు. ఇప్పుడు ప్రశ్నించే టైమ్ వచ్చింది కాబట్టే.. ప్రశ్నిస్తున్నానన్నారు.
విభజన తీరును సూటిగా, సెటైరికల్ గా ప్రశ్నించారు. విభజన టైమ్ లోనే కాంగ్రెస్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అప్పటి ఎంపీలంతా పోరాడలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వాళ్లకు సిగ్గూ, శరం ఉంటే ఇప్పుడు అడుక్కునే పరిస్థితి ఉండేది కాదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ నుంచి కేంద్రమంత్రి జైరాం రమేష్ వరకు అందరిని నిలదీశారు. ముఖ్యంగా జైరాం రమేష్ పై వ్యంగాస్త్రలతో విరుచుకుపడ్డారు. ఆయన తెలివితేటలతో రాష్ట్రాన్ని విడదీశారని.. ఆయన్ను రాష్ట్రం నుంచి ఎన్నుకున్న కాంగ్రెస్ ఎంపీలకు హ్యాట్సాఫ్ అంటూ వాల్ల తీరును సునిశితంగా విమర్శించారు.
మరోజాతీయ పార్టీ బీజేపీని వదిలిపెట్టలేదు. ముఖ్యంగా మోదీని గౌరవిస్తున్నానంటూనే.. ఆయన తీరును నిలదీశారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అడ్డమేంటని ప్రశ్నించారు. మీరంటే గౌరవమే కానీ.. గులాంగిరి చేసే గౌరవం కాదన్నారు. అటు వెంకయ్యను కడిగిపారేశారు పవన్. విభజనటైమ్ లో స్టేటస్ పై పోరాడిన వెంకయ్యకు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. రాజకీయాల కోసం కాదు.. జనం కోసం పనిచేయాలన్నారు. స్టేటస్ పై ఇటీవల చేసిన కామెంట్స్ ను వెనక్కు తీసుకోవాలన్నారు.
ఇక ఏపీసీఎం చంద్రబాబు, టీడీపీ నేతల తీరును ఏకిపారేశారు. కేంద్రాన్ని నిలదీయడానికి భయమెందుకని నిలదీశారు. భయపడుతూ ఎన్నాళ్లు బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. సీబీఐ ఎంక్వైరీ అని భయపడుతున్న కొంతమంది నేతలంటూ జగన్ ను టార్గెట్ చేశారు పవన్. లొసుగులున్నాయి కాబట్టే కేంద్రాన్ని నిలదీయడంలేదా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో తిరుగుతూ జనాన్ని చైతన్యం చేస్తానని.. పార్టీల గుండెల్లో బాంబు పేల్చారు పవన్.