ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం 8మంది బీటెక్ విద్యార్థుల ప్రాణాలు తీసింది. బుధవారం తెల్లవారుఝామున హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన ప్రమాదం అందరిని కలచివేసింది. స్నేహితురాలి పెళ్లికని తొమ్మిది విద్యార్థులు టవేరా వాహనంలో బయల్దేరారు. అంతా సరదాగా మాట్లాడుకుంటూ.. జోకులేసుకుంటూ ప్రయాణం సాఫీగానే సాగుతూ ఔటర్ చేరుకుంది. అక్కడే టోల్ గేట్ దగ్గర అన్ని వాహనాల వెనుక వీళ్ల వాహనం ఆపారు. ఇంతలోనే వెనకనుంచి మృత్యుశకటంలా వచ్చిన ఓ డీసీఎం టవేరాను గుద్దేసింది. అంతే ముందున్న లారీ.. వెనుకనుంచి డీసీఎం మధ్యలో టవేరా నుజ్జునజ్జైంది. దీంతో స్పాట్ లోనే 8మంది స్టూడెంట్స్ చనిపోయారు. మిగిలిన ఒక్కరి పరిస్థితి సీరియస్ గా ఉంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారి గ్రామం దగ్గర జరిగిందీ ఘటన.
మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన విద్యార్థులు వీళ్లంతా. వీళ్లను మహ్మద్ అఖిల్ (19), ఇమ్రోజ్ (25) షఖావత్ (30), ఇఫ్రాన్ (18), ఫిరోజ్ (22), నిషాద్ (24), అక్బర్ (28)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ అబ్బాస్ కు గాంధీ హాస్పిటల్ లో చికిత్స జరగుతోంది. ఇంకా ఒకళ్లని గుర్తించాల్సి ఉంది.