సీఎం కేసీఆర్ నోటివెంట రాజీనామా మాటలొచ్చాయి. రాజ్ భవన్ కు వెళ్లి మరీ రాజీనామా చేస్తానన్నారాయన. మహారాష్ట్ర నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకున్న సీఎం.. అక్కడే విజయరథం నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒప్పందం చేసుకున్న జోష్ లో ఉన్న కేసీఆర్.. విపక్షాలను ఏకీ పడేశారు. ఒప్పందాలపై అందరూ ఆనందంగా ఉంటే కాంగ్రస్ సన్నాసులకు మాత్రం నల్లజెండాలు కనబడుతున్నాయని విమర్శించారు. గతంలోనే ఒప్పందాలు చేసుకున్నామన్న కాంగ్రెస్ నేతలు.. ఆ ఒప్పందాలు తీసుకుని బేగంపేట రావాలని సవాల్ చేశారు. అవే నిజమైతే.. బేగంపేట నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్లి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్ టీడీపీ నేతలు జైలుకెళ్లాల్సిందే : విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆరోపణలు రుజువు చేయకపోతే.. విపక్ష నేతలపై కేసులు పెడతామన్నారు. అవసరమైతే జైలు కూడు కూడా తినిపియ్యడానికి కూడా వెనుకాడబోమన్నారు సీఎం. ప్రాజెక్టులపై నిజాలు చెప్పేందుకు వచ్చే రెండుమూడ్రోజుల్లో ఓ టీవీ చానల్ లో కూర్చుంటానన్నారు.