Movies"గృహం" రివ్యూ & రేటింగ్‌

“గృహం” రివ్యూ & రేటింగ్‌

చిత్రం: గృహం
నటీనటులు: సిద్ధార్థ్‌.. ఆండ్రియా.. సురేష్‌.. అతుల్‌ కుల్‌కర్ణి.. అనీషా ఏంజెలీనా విక్టర్‌ తదితరులు
సంగీతం: గిరీష్‌
కూర్పు: లారెన్స్‌ కిషోర్‌
కళ: శివ శంకర్‌
ఛాయాగ్రహణం: శ్రేయాస్‌ కృష్ణ
ఫైట్స్‌: ఆర్‌.శక్తి శరవణన్‌
నిర్మాత: సిద్ధార్థ్‌
రచన: మిలింద్‌.. సిద్ధార్థ్‌
దర్శకత్వం: మిలింద్‌ రావ్‌
సంస్థ: వైకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌

గ్లామర్ ఇండస్ర్టీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ ఒకడు. వరుస అపజయాలు దుర్కొంటున్న తరుణంలో, తానే నిర్మాతగా మారి ఓ హారర్ కథతో గృహం మూవీ తీశాడు. కొంత కాలంగా హారర్‌ నేపథ్యం ఉన్న చిత్రాల హవా నడుస్తున్న క్రమంలో ‘గృహం’ ఏ మేర భయపెట్టింది? సిద్ధార్థ్‌కు పూర్వ వైభవం తెచ్చిందా?

కథ:
కృష్ణకాంత్‌ అలియాస్‌ క్రిష్‌(సిద్ధార్థ్‌) డాక్టర్‌. అతని భార్య లక్ష్మి(ఆండ్రియా). వారిది అన్యోన్య దాంపత్యం. హిమాలయాలకు దగ్గరగా ఉంటారు. వారి ఎదురింట్లో కొత్తగా ఓ కుటుంబం దిగుతుంది. వారిలో జెన్నీ అనే అల్లరి అమ్మాయి క్రిష్‌ని ఆటపట్టిస్తుంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జెన్నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు చైనీస్‌ మాట్లాడుతుంటుంది. మానసిక నిపుణుడు(సురేష్‌) కూడా జెన్నీ సమస్యను కనిపెట్టలేకపోతాడు. సమస్య పరిష్కారానికి పాల్‌(అతుల్‌ కుల్‌కర్ణి) అనే పాస్టర్‌ సాయం తీసుకుంటాడు. అప్పుడు జెన్నీలో లీజింగ్‌ అనే దెయ్యం ఉందన్న సంగతి తెలుస్తుంది. ఇంతకీ లీజింగ్‌ ఎవరు? జెన్నీని ఎందుకు ఆవహించింది? లీజింగ్‌తో పాటు ఉన్న మరో రెండు ఆత్మలు ఎవరివి అనేదే ‘గృహం’ కథాంశం!

విశ్లేషణ:
‘గృహం’ కథ కూడా రొటీన్ హారర్ సినిమాల్లాంటిదే. అయితే కామెడీ ఎప్పుడైతే పక్కకుపెట్టి, సీరియస్ అంశాన్ని సీరియస్‌గానే చెప్పడం మొదలెట్టారో, అప్పుడే భయం కనిపించడం మొదలైంది. సిద్దార్థ్-ఆండ్రియా మధ్య బెడ్ రూమ్ సన్నివేశాలతో, లిప్‌లాక్‌లతో సినిమా హాట్ హాట్‌గా మొదలవుతుంది. జెన్నీ ఆత్మహత్యా ప్రయత్నం దగ్గర్నుంచి కథలోకి భయం అనే ఎలిమెంట్ ప్రవేశిస్తుంది. ఇంట్రవెల్ సీన్‌లో.. సిసలైన హారర్ సినిమా చూపించాడు దర్శకుడు. సౌండ్ ఎఫెక్ట్స్ , విజువల్స్‌ తో కావల్సినంత భయపెట్టాడు. ఇక సెకండాఫ్‌లో దెయ్యాన్ని వదిలిస్తే సరిపోతుంది అనుకొంటారంతా. అలా చేస్తే.. ‘గృహం’ కూడా మామూలు దెయ్యం కథలానే మిగిలిపోదును. సెకండాఫ్‌లో ఓ ట్విస్ట్ వస్తుంది. అది మాత్రం. షాక్ ఇచ్చేదే. అక్కడే దర్శకుడు మొత్తం మార్కులు కొట్టేస్తాడు. అప్పటి వరకూ సైడ్ క్యారెక్టర్‌లా అనిపించిన సిద్దూ.. ఆ ట్విస్ట్ తరవాత రెచ్చిపోతాడు. ఇంట్రవెల్ సీన్స్‌లో ఎంత భయపడ్డారో, పతాక సన్నివేశాల్లో అంతకంటే ఎక్కువ భయం కలిగించాడు. మొత్తానికి ఓ నిజమైన హారర్ అనుభూతి కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. కథ రొటీనే అయినా, నేపథ్యం మార్చడం, అందులో సిద్దూ లాంటి లవర్ బోయ్‌ని ఎంచుకోవడం, దానికి తోడు. ఒకటీ, రెండు దెయ్యాలు కాక. మూడు దెయ్యాల్ని కథలో చొప్పించడం. ఇలా పాత కథకు కొత్త కోటింగ్ ఇచ్చే ప్రయత్నం చేయడం వర్కవుట్ అయ్యింది.

ఎవరెలా చేశారు: తక్కువ పాత్రలతో కథను నడిపించాడు దర్శకుడు. క్రిష్‌, జెన్నీ పాత్రలు ఈ కథకు మూలం. సిద్ధార్థ్‌ ఓ హారర్‌ సినిమా చేయటం ఇదే ప్రథమం. కానీ, ఇలాంటి జోనర్‌ను కూడా తనదైన నటనతో రక్తికట్టించగలనని నిరూపించాడు. ప్రారంభంలో సిద్ధార్థ్‌ అతిథి పాత్ర ఏమో అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధంలో రెచ్చిపోయి, నటించాడు. జెన్నీ పాత్రలో కనిపించిన అమ్మాయి గ్లామర్‌ పరంగా సాదాసీదాగా ఉన్నా, నటన విషయంలో సిద్ధార్థ్‌కు సమాన స్థాయిలో ప్రతిభను ప్రదర్శించింది. లీజింగ్‌ ఆత్మ ఆవహించిన తరుణంలో ఆమె హావభావాలు భయపెట్టాయి. ఆండ్రియా లిప్‌లాక్‌ సన్నివేశాలు నటించడానికి మొహమాట పడలేదు. సురేష్‌, అతుల్‌ కుల్‌కర్ణి తమ పాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే.. దర్శకుడి స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతంలో సౌండింగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా సాగింది. హారర్‌ సినిమాల్లో కామెడీ ఎక్కువైపోయి భయం తగ్గిపోతున్న ఈ తరుణంలో ‘గృహం’ తప్పకుండా షాకిస్తుంది.
ఫైన‌ల్ పంచ్‌: ‘గృహం’ ప్రజల్ని ఆకర్షించే ఒక రొమాంటిక్ హార్రర్ మూవీ.
రివ్యూ & రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news