Moviesదిల్‌రాజును స్టార్ ప్రొడ్యుస‌ర్‌ను చేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి... వీరిద్ద‌రి ...

దిల్‌రాజును స్టార్ ప్రొడ్యుస‌ర్‌ను చేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి… వీరిద్ద‌రి చెక్కు చెద‌ర‌ని బంధం ఇదే..!

తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ చెన్నైలో ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. ఆయ‌న‌ స్వస్థలం విశాఖపట్నం. కృష్ణ పేరుతో తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది ఉన్నారు. అయితే కాస్ట్యూమ్స్ కృష్ణ అంటే గుర్తుకు వచ్చేది మాత్రం ఆయన ఒక్కరే. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. 1954లో మద్రాసు వెళ్లిన ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ రోజులు పనిచేశారు.

అందుకే ఆయనను అందరూ సురేష్ కృష్ణ అని పిలిచేవారు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా ఆయన పేరు స్థిరపడింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్‌బంద్‌ సినిమాతో ఆయన నటుడుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన ఇంటిపైన కోడి రామకృష్ణ ఉండేవారు. ఆయనే పిలిచి భారత్ బంద్ సినిమా కోసం మూడు రోజులు వేషం వేయమని అడగడంతో కృష్ణ అయిష్టంగానే ఓకే చెప్పారు.

ఆ సినిమాలో ఆయన పాత్రకు మంచి పేరు రావడంతో.. అక్కడి నుంచి ఆయన వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత పెళ్ళాం చెపితే వినాలి – పోలీస్ లాకప్ – అల్లరి మొగుడు – దేవుళ్ళు – మా ఆయన బంగారం – విలన్ – శాంభవి ఐపీఎస్ – పుట్టింటికి రా చెల్లి సినిమాలలోను నటించారు. నిర్మాతగాను ఎన్నో సినిమాలు తీశారు. జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లి పందిరి సినిమాకు ఆయ‌నే నిర్మాత కావటం విశేషం.

సూప‌ర్‌స్టార్ కృష్ణ అశ్వ‌థ్థామ సినిమాకు ఆయ‌నే నిర్మాత‌. ఆయ‌న నిర్మించిన ఓ సినిమా రైట్స్ దిల్ రాజు రు. 36 ల‌క్ష‌ల‌కు కొన్నారు. ముందు రు. 34 ల‌క్ష‌లు ఇచ్చారు. సినిమా అట్ట‌ర్‌ప్లాప్ అయ్యింది. డ‌బ్బులు రాలేదు. నాలుగు రోజుల్లో రాజు మిగిలిన రు. 2 ల‌క్ష‌లు కూడా తీసుకువెళ్లి ఇవ్వ‌డంతో కృష్ణ షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్మించిన పెళ్లిపందిరి సినిమా రైట్స్ కోసం చాలా మంది పోటీప‌డినా కూడా కృష్ణ ప‌ట్టుబ‌ట్టి రాజుకే ఆ సినిమా రైట్స్ ఇచ్చారు.

తాను డిస్ట్రిబ్యూష‌న్ ఆపేశాన‌ని.. ఆఫీస్ మూసేశాన‌ని చెప్పినా కూడా కృష్ణ అడ్వాన్స్ తీసుకోకుండా రాజుకు ఆ సినిమా రైట్స్ ఇచ్చారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అక్క‌డ నుంచి దిల్ రాజు ప‌ట్టింద‌ల్లా బంగారం అయ్యింది. అలా కాస్ట్యూమ్స్ కృష్ణ చేసిన సాయం వ‌ల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాన‌ని దిల్ రాజు చాలాసార్లు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news