ReviewsTL రివ్యూ: స‌ర్కారు వారి పాట‌.. సూప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఆట‌

TL రివ్యూ: స‌ర్కారు వారి పాట‌.. సూప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఆట‌

టైటిల్‌: స‌ర్కారు వారి పాట‌
బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్ – GMB ఎంట‌ర్టైన్‌మెంట్ – 14 రీల్స్‌
న‌టీన‌టులు: మ‌హేష్‌బాబు, కీర్తి సురేష్‌, వెన్నెల కిషోర్‌, సుబ్బ‌రాజు, స‌ముద్ర‌ఖ‌ని
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌. మ‌ది
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: ఏఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్ – ల‌క్ష్మ‌ణ్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్‌
కో డైరెక్ట‌ర్‌: విజ‌యా రాం ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని – వై. ర‌విశంక‌ర్ – రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ప‌ర‌శురాం పెట్ల‌
పీఆర్వో: దివంగ‌త బిఏ. రాజు – వంశీ – శేఖ‌ర్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 162 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 12 మే, 2022

స‌ర్కారు వారి పాట ప‌రిచ‌యం :
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. అప్పుడెప్పుడో 2020 సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మాత్ర‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌హేష్‌ను ఇన్ని రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో చూస్తుండ‌డంతో సూప‌ర్‌స్టార్ అభిమానులే కాదు… తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. మ‌హేష్ భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉండ‌డం.. గీత‌గోవిందం త‌ర్వాత ప‌ర‌శురాం డైరెక్ట్ చేసిన సినిమా.. టీజర్లు, ట్రైల‌ర్ల‌తోనే సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో స‌ర్కారు వారి పాట‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు ఏ స్థాయిలో అందుకుందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
అమెరికాలో మ‌హి బ్యాంక్ అధినేత మ‌హేష్ ( మ‌హేష్ బాబు ) బ్యాంకు పెట్టుకుని వ‌డ్డీల‌కు లోన్లు ఇస్తూ ఉంటాడు. అత‌డి ద‌గ్గ‌ర క్యాసినో ఆడేందుకు అబ‌ద్ధాలు చెప్పి క‌ళావ‌తి ( కీర్తి సురేశ్ ) డ‌బ్బులు అప్పుగా తీసుకుంటుంది. పైగా మ‌హేశ్‌ను ప్రేమిస్తున్న‌ట్టు న‌మ్మించ‌డంతో మ‌నోడు క‌ళావ‌తి మాయ‌లో ప‌డి బాగా చేతిచ‌మురు వ‌దిలించుకుంటాడు. చివ‌ర‌కు ఆమె జూదం కోసం త‌న‌ను మోసం చేసింద‌న్న విష‌యం తెలుసుకుంటాడు. క‌ళావ‌తి త‌న‌ తండ్రి రాజేంద్ర‌నాథ్ ( స‌ముద్ర‌ఖ‌ని ) తో మ‌హేశ్‌కు వార్నింగ్ ఇప్పిస్తుంది. త‌న‌కు రావాల్సిన 10 వేల డాల‌ర్లను క‌ళావ‌తి తండ్రి రాజేంద్ర నుంచి వ‌సూలు చేసేందుకు అమెరికా నుంచి వైజాగ్‌కు వ‌స్తాడు మ‌హేష్‌. ఈ క్ర‌మంలోనే రాజేంద్ర చేసిన 10 వేల కోట్ల కుంభ‌కోణం గురించి బ‌య‌ట పెట్టి వైజాగ్‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని షేక్ చేస్తాడు ? ఎంద‌రో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం మ‌హేష్ ఎలాంటి పోరాటం చేశాడు ? చివ‌ర‌కు క‌థ ఏమైంది అన్న‌దే స్టోరీ.

TL విశ్లేష‌ణ :
ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ఫ‌స్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ను బిల్డ‌ప్ చేసేందుకు ప్రెష్‌ఫీల్ ఉన్న రొమాంటిక్ సీన్లు రాసుకున్నాడు. హీరోయిన్ విదేశాల్లో జూదం ఆడి డ‌బ్బులు పోగొట్టి అంద‌రికి అప్పులు పెడుతుంది. తిరిగి మ‌ళ్లీ జూదం ఆడేందుకు మ‌హేష్‌నే బురిడీ కొట్టించి 10 వేల పెన్నీలు అప్పు కొట్టేస్తుంది. ఈ ట్రాక్ బాగా డిజైన్ చేశాడు ప‌ర‌శురాం. అయితే అదే 10 వేల డాల‌ర్ల కోసం మ‌హేష్ అమెరికా నుంచి వైజాగ్ రావ‌డం కాస్త అతి అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లోనే క‌ళావ‌తి, పెన్సీ సాంగ్స్‌, మూడు ఫైట్లు ఉంటాయి.. ఫ‌స్టాఫ్ అలా పాస్ అయిపోయింది.

అయితే ఇంట‌ర్వెల్ ఎక్క‌డ ఇవ్వాలో క‌రెక్టుగా డిజైన్ చేయ‌లేదన్న‌ట్టుగా ఉంది. సెకండాఫ్‌లో స‌ముద్ర‌ఖ‌ని – మ‌హేష్‌ మ‌ధ్య వార్ సీన్లు, కీర్తి సురేశ్‌పై మ‌హేష్‌ కాలు వేసుకుని చేసిన కామెడీ, మ‌మ మ‌హేశా సాంగ్స్ ప్రేక్ష‌కుల‌కు మాంచి ఊపు ఇచ్చాయి. సెకండాఫ్‌లో సీరియ‌స్ ట్రాక్‌తో పాటు కీర్తి, ప్ర‌భాస్ శ్రీనుతో చేసే కామెడీ స్కిట్స్ కాస్త ఎంట‌ర్టైనింగ్ అనిపించాయి. క్లైమాక్స్‌ను కూడా సాగదీయ‌కుండా ముగించేశాడు.

క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా మ‌హేష్‌బాబు త‌న భుజాల మీద సినిమాను మోస్తూ ముందుకు న‌డిపించాడు. మ‌హేష్ న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో చాలా లోపాలు కప్ప‌డిపోయాయి. అందంతో పాటు త‌న‌దైన స్టైల్‌, డ్యాన్సుల్లో ఇర‌గ‌దీశాడు. అలాగే కీర్తి సురేష్‌తో రొమాంటిక్ ట్రాక్‌లో కూడా కుర్రాడిలా క‌నిపించాడు. న‌టీన‌టుల్లో హీరోయిన్ కీర్తి న‌ట‌న బాగున్నా.. కాస్ట్యూమ్స్ లోపంతో ఆమెలో మునుప‌టి గ్లామ‌ర్ క‌న‌ప‌డ‌లేదు. ఫ‌స్టాఫ్‌లో వెన్నెల కిషోర్‌, సెకండాఫ్‌లో ప్ర‌భాస్ శ్రీను కామెడీ బాగుంది.

స‌ముద్ర‌ఖ‌ని త‌న‌కు అల‌వాటైన రేంజ్‌లోనే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా క‌నిపించాడు. అయితే అదే పంచెక‌ట్టు.. అదే ఎక్స్‌ప్రెష‌న్స్ అన్న‌ట్టుగా ఈ పాత్ర‌ను గ‌తంలో చూసిన‌ట్టే ఉంటుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి, మిగిలిన న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల వ‌ర‌కు మెప్పించారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా చూస్తే థ‌మ‌న్ సాంగ్స్ అదిరిపోయాయి. తెర‌మీద కూడా సాంగ్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం కూడా ఫ‌స్ట్ ఫైట్‌తో పాటు కీర్తితో రొమాంటిక్ ట్రాక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్రేక్ష‌కుడు సినిమాను ఎంజ‌య్ చేసేలా ఉంది. అయితే కొన్ని చోట్ల పాత వాస‌న‌లు క‌నిపించాయి. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ బ్యూటిఫుల్‌గా ఉంది. ప్ర‌తి ఫ్రేమ్ క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాడు. రామ్ – ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్టుగా లేదు. యాక్ష‌న్ అంతా పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలా ఉంది. ఈ యాక్ష‌న్ సీన్లు ఎన్నో సినిమాల్లో అది కూడా మ‌హేష్ సినిమాల్లో చూసేసిన‌ట్టే ఉన్నాయి. మ‌ర్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ క్రిస్పీగానే ఉంది. కొన్ని చోట్ల ల్యాగ్ అయిన‌ట్టు ఉన్నా అది క‌థ‌, క‌థ‌నం ప‌రంగా ఉన్న మిస్టేకే త‌ప్పా ఎడిట‌ర్‌ను త‌ప్పుప‌ట్ట‌లేం. మైత్రీ, 14 రీల్స్‌, జీఎంబీ సంస్థ‌ల నిర్మాణ విలువ‌లు రీచ్‌గా ఉన్నాయి. ఆర్ట్ వ‌ర్క్ ప్ర‌తి సీన్‌లోనూ రీచ్‌గా ఉంది.

ప‌ర‌శురాం డైరెక్ష‌న్ క‌ట్స్‌:
ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం మ‌హేశ్‌బాబును డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ఓ బ‌ల‌మైన క‌థ… అంత‌క‌న్నా బ‌ల‌మైన స్క్రీన్ ప్లేతో ముందుకు రావాల్సింది. బ్యాంకుల కుంభ‌కోణం బ‌య‌ట‌పెట్ట‌డం అంటే దానికి ముందు బ‌ల‌మైన సీన్ల ఎలివేష‌న్ ఉండాలి. గీత‌గోవిందం రేంజ్‌లో ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం లేద‌నే అనిపిస్తుంది. మ‌హేష్ నుంచి స‌రైన నట‌న కూడా రాబ‌ట్టుకోలేక పోయాడు. స్క్రీన్ ప్లేలో స‌రైన మ్యాజిక్ లేదు. అయితే స‌రిలేరు నీకెవ్వ‌రుతో పోలిస్తే మాత్రం చాలా బాగా స‌ర్కారు వారి పాట తీసిన‌ట్టే..! బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్‌గా కాసులు ఎలా రాల్చాలా ? అన్న ఫార్మాట్‌లోనే సినిమాను తెర‌కెక్కించి అక్క‌డ స‌క్సెస్ అయ్యాడు.

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :
– మ‌హేశ్ బాబు వ‌న్ మ్యాన్ షో
– ఫ‌స్టాఫ్‌లో మ‌హేష్ – కీర్తి మ‌ధ్య రొమాంటిక్‌, ఎంట‌ర్టైన్‌మెంట్ ట్రాక్‌
– మూడు సాంగ్స్‌
– మ‌ది సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ ( – ) :
– వీక్ స్టోరీ లైన్‌
– కొన్ని చోట్ల స్లో నెరేష‌న్‌
– మ‌హేశ్ రేంజ్‌కు త‌గిన‌ట్టుగా ప‌ర‌శురాం ఎలివేష్లు ఇవ్వ‌క‌పోవ‌డం
– మ్యాజిక్ మిస్ అయిన స్క్రీన్ ప్లే

ఫైన‌ల్‌గా…
స‌ర్కారు వారి పాట వీక్ స్టోరీ. అయితే మ‌హేష్‌బాబు వ‌న్ మ్యాన్ షో, కామెడీ, ఫ‌స్టాఫ్‌లో కీర్తి – మ‌హేశ్ రొమాంటిక్ ట్రాక్ ఇవ‌న్నీ సినిమాను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్కించేస్తాయి. ప‌ర‌శురాం ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం విష‌యంలో త‌డ‌బ‌డినా మ‌హేషే వాటిని క‌ప్పేశాడు. మ‌హేష్‌బాబు సినిమా కావ‌డంతో కథ‌, క‌థ‌నాల కంటే బ‌లంగా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌నే ద‌ర్శ‌కుడు బాగా న‌మ్ముకున్నాడు. ఓవ‌రాల్‌గా సోష‌ల్ మెసేజ్ మిక్స్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ స‌మ్మ‌ర్‌లో కూల్‌గా గ‌ట్టెక్కేస్తుంది.

బాట‌మ్ లైన్ :
స‌ర్కారు వారి పాట రికార్డుల వేట‌
స‌ర్కారు వారి పాట సూప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఆట‌

స‌ర్కారు వారి పాట TL రేటింగ్ : 3.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news