ఖైదీ రీమేక్‌ను చేస్తానంటోన్న ఆర్ఆర్ఆర్ హీరో

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఇది బాక్సాఫీస్‌ను ఎలాంటి చెడుగుడు ఆడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఓ పాన్ ఇండియా సినిమాగా వస్తుండటంతో ఇందులో కేవలం తెలుగు హీరోలే కాకుండా బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మరో దక్షిణాది చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ఈ ఆర్ఆర్ఆర్ హీరో ఆసక్తి చూపుతున్నాడట. తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను బాలీవుడ్‌లో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్‌తో కలిసి రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశాయి.

అయితే దక్షిణాది సినిమాలైన సింగం సిరీస్‌ను బాలీవుడ్‌లో చేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌లు అందుకున్న అజయ్ దేవ్గన్, మరోసారి దక్షిణాది సినిమాను రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో, ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తి చూపుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేశాడు. మరి బాలీవుడ్‌లో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a comment