Movies‘నేను లోకల్’ స్పెషల్ షో రివ్యూ.. మాస్ టచ్‌తో క్లాప్స్ కొట్టించుకున్న...

‘నేను లోకల్’ స్పెషల్ షో రివ్యూ.. మాస్ టచ్‌తో క్లాప్స్ కొట్టించుకున్న నాని

Exclusive special show review of Nani’s latest film Nenu Local, bankrolled by Dil Raju. Trinadha Rao Nakkini directed this film and Keerthy Suresh played female lead.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చాలాకాలం నుంచి ఓ ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్నాడు. తన చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెండు లేదా ఒకరోజు ముందే ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు నిర్వహిస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి రకరకాల మార్గాల్లో తన చిత్రాల్ని ప్రమోట్ చేసుకునే ఈ నిర్మాత.. అందులో భాగంగానే మీడియా వారి కోసం ఈ షోలు వేస్తాడు. తన సినిమాలపై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే ఇలా షోలు వేసి.. క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇప్పుడు తాను తాజాగా నిర్మించిన ‘నేను లోకల్’ సినిమాని కూడా ఒకరోజు ముందే స్పెషల్ షో వేశాడు దిల్‌రాజు. చూసిన ప్రతిఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా ఐదు విజయాల తర్వాత నాని మరోసారి ఆకట్టుకుని.. డబుల్ హ్యాట్రిక్ సాధించాడని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అంతగా ఆకట్టుకునేలా ఈ చిత్రంలో ఏముందో.. రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి…

స్టోరీ :
బాబు (నాని).. ఎప్పుడూ సరదాగా కాలం వెళ్లదీసే ఓ కాలేజ్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్‌తో అల్లరిచిల్లరగా తిరిగే బాబు.. కెరీర్ గురించి పట్టించుకోకుండా నిత్యం ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఓసారి కీర్తి (కీర్తి సురేష్)ని చూసి.. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి ఎంబీఏలో జాయిన్ అవుతాడు. కానీ.. అతడు చేసే అల్లరిచిల్లరి చేష్టలు కీర్తికి, ఆమె ఫ్యామిలీకి నచ్చవు. అయితే.. ఒకానొక టైంలో కీర్తి కూడా అతని ప్రేమలో పడిపోతుంది. కానీ.. ఆమె తండ్రి (సచిన్ ఖేడ్కర్) మాత్రం వారి ప్రేమని నిరాకరిస్తాడు. అప్పుడు బాబు ఆయనకి ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి? తమ ప్రేమని అంగీకరించేలా కీర్తి తండ్రిని బాబు ఎలా ఒప్పిస్తాడు? అనే అంశాల చుట్టే ఈ మూవీ కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఫస్టాఫ్ మొత్తం ఫ్రెష్ లవ్ స్టోరీ, ఎంటర్టైన్‌మెంట్ అంశాలతో సాగిపోతుంది. ఎక్కడా బోరింగ్ అనిపించుకుండా సరదాగా సాగిపోతుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ.. కీర్తిని ఇంప్రెస్ చేయడం కోసం నాని చేసే అల్లరిచిల్లరి పనులు ఆకట్టుకుంటాయి. కీర్తి, నానిల కెమెస్ట్రీ చాలా బాగుంది. కొన్ని ఎపిసోడ్‌లు రొటీన్‌గా అనిపించినప్పటికీ.. వాటిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. వినసొంపుగా ఉండే పాటలు సందర్భానుకూలంగా వస్తాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ముగుస్తుంది.

ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. కాసేపు కాస్త ఇంట్రెస్టింగ్‌గానే నడుస్తుంది. కానీ.. ఎప్పుడైతే ట్విస్ట్ రివీల్ అవుతుందో, అప్పుడు సినిమా డల్ అయిపోయింది. 30 నిముషాలపాటు సినిమా అలాఇలా సాగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత మాత్రం మళ్ళీ సినిమా పుంజుకుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అవే సెకండాఫ్‌కి ప్రత్యేక ఆకర్షణలు. ముఖ్యంగా.. క్లైమాక్స్ అదిరిపోయింది. ఆ ఎపిసోడ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రతిఒక్కరినీ హత్తుకుంటాయి. ఆ సీన్లలో నాని, కీర్తి తమ అద్భుత అభినయంతో కట్టిపడేశారు.

ఓవరాల్‌గా చూస్తే.. కొన్ని రొటీన్ సీన్స్ తప్ప ఫస్టాఫ్ అంతా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అదిరింది. ఇక సెకండాఫ్‌‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక స్టోరీ కాస్త గాడి తప్పినట్లుగా అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎమోషన్ సీన్స్ హైలైట్. రెండో భాగంలో వచ్చే బోర్ సీన్స్‌ని నెగ్లెక్ట్ చేస్తే.. ఈ సినిమాని భలే ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటుల పనితీరు :
నాని ఎప్పటిలాగే తన నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన కామిక్ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. తన ఇమేజ్‌కి భిన్నంగా మాస్ రోల్‌లో నటించి.. దానికి పూర్తి న్యాయం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ చిత్రాన్ని తన భుజాలపై నడిపించాడు. కీర్తి సురేష్ కూడా అందంగా కనిపించడంతోపాటు తన నటనతో కట్టిపడేసింది. నాని, కీర్తిల కెమిస్ట్రీ అదిరింది. ఆమె తండ్రిగా నటించిన సచిన్ ఖేడ్కర్ కూడా బాగా నటించాడు. పోసాని కృష్ణమురళితోపాటు ఇతర నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక పనితీరు :
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం చాలా డీసెంట్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు కానీ.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ ఈ సినిమాకి అసెట్స్. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభ చాటాడు.

ఫైనల్ వర్డ్ : ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news