Movies‘శాతకర్ణి’ ఓవరాక్షన్‌పై విరుచుకుపడ్డ రాజమౌళి.. అదంతా ఫేక్ అట!

‘శాతకర్ణి’ ఓవరాక్షన్‌పై విరుచుకుపడ్డ రాజమౌళి.. అదంతా ఫేక్ అట!

Tollywood ace director SS Rajamouli lashes out Gautamiputra Satakarni team for publishing a letter he never wrote.

దర్శకుడు క్రిష్, రాజమౌళి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. అలాంటి స్నేహం ఉండబట్టే తాను ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక సినిమా తీస్తున్నానని క్రిష్ చెప్పగానే, జక్కన్న అతడ్ని ప్రోత్సాహించాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపాడు కూడా. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి ఈ చిత్రంపై జక్కన్న ప్రశంసలు కురిపిస్తూనే వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ విడుదలయ్యాక ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక సినిమా చూశాక.. క్రిష్, మూవీపై పొగడ్తలతో ముంచెత్తాడు. కేవలం 79 రోజుల్లోనే ఈ కళాఖండాన్ని ఎలా తెరకెక్కించావంటూ ఆకాశానికెత్తేశాడు. అలాంటి జక్కన్న.. ‘శాతకర్ణి’ యూనిట్‌పై విరుచుకుపడ్డాడు. తాను చేయని పనిని చేసినట్లుగా చూపించడంతో.. ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏమైంది? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూసిన అనంతరం దర్శకధీరుడు రాజమౌళి ఆ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ క్రిష్‌కి ఓ లేఖ రాశాడని గతకొన్నాళ్ల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. జక్కన్న రాసిన లేఖ ఇదే అంటూ ఓ లెటర్‌ కూడా వైరల్ అయ్యింది. ఓ పెద్ద డైరెక్టర్ తొలిసారి అలా లెటర్ రాయడం ఇదే తొలిసారి కావడంతో.. వెబ్‌సైట్లతోపాటు న్యూస్ పేపర్లు కూడా దాన్ని ప్రచురించాయి. ఎలాగో జక్కన్న ముందునుంచి ‘శాతకర్ణి’పై ప్రశంసిస్తూ వస్తున్నాడు కదా.. ఈ లెటర్ కూడా రాసి ఉంటాడులే అని అందరూ అనుకున్నారు. కానీ.. ఈ లెటర్ తాను రాయలేదని జక్కన్న తాజాగా కుండబద్దలు కొట్టేశాడు. తాను క్రిష్‌కి ఏ లెటర్ రాయలేదని.. ఆ వార్తలన్నీ ఫేక్ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ వార్త విన్న తర్వాత తాను షాక్‌కి గురయ్యానని తెలిపాడు.

‘క్రిష్‌తో ఇంటర్వ్యూ చేయమని నాకు అడిగినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే.. అతను తెరకెక్కించిన ‘శాతకర్ణి’ సినిమా నాకెంతో నచ్చింది. నేను కూడా ఆ చిత్రాన్ని మెచ్చుకున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం దాన్ని ప్రింట్ మీడియాకి వినియోగించుకోవచ్చా? అని అడిగినప్పుడు అందుకు కూడా సరేనన్నాను. కానీ.. నేను లెటర్ రాసినట్లుగా వస్తున్న వార్తలు చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ లెటర్‌లో ఇంటర్వ్యూ నుంచి తీసుకున్న కంటెంట్ ఎక్కువభాగం ఉంది కానీ.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానమే కాస్త ఓవర్‌గా ఉంది. ఈ విషయంపై నేను క్రిష్‌కి ఫోన్ చేసి అడగ్గా.. తన చిత్రబృందం చేసిన అత్యుత్సాహమని పేర్కొన్నాడు. దీనిపై వారినుంచి క్లారిఫికేషన్ అడిగాను కానీ.. అది అందలేదు. అలాగని సినిమా మీదగానీ, క్రిష్ మీదగానీ, యూనిట్‌పైగానీ నా అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ చిత్రం మరింత కలెక్షన్లు రాబట్టాలని కోరుకుంటున్నా. ఆ లేఖ మాత్రం నేను రాయలేదు అంతే!’ అంటూ ట్విటర్ వేదికగా వివరించాడు జక్కన్న.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news