Specialsనాకు జీవితం అంటే ఏంటో చెప్పిన నా ‘హైపర్’ నారాయణమూర్తి !!

నాకు జీవితం అంటే ఏంటో చెప్పిన నా ‘హైపర్’ నారాయణమూర్తి !!

నా పేరు వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిని. నాకు ఆసక్తికరంగా రాయడం కూడా అంతగా రాదు కానీ నా మనసును తొలుస్తున్న కొన్ని ఆలోచనలను మాత్రం పదిమందితో పంచుకోవాలని అనిపించింది. మా పిల్లలిద్దరూ గొడవ చేస్తూ ఉంటే ‘హైపర్’ సినిమాకు వాళ్ళను తీసుకెళ్ళాను. ఆ టైటిల్ ఏంటో…సినిమా ఏంటో కూడా నాకు తెలియదు. టివిలలో సినిమాలు చూడడమే కానీ థియేటర్ వరకూ వెళ్ళడం కూడా తక్కువే. కానీ మా పిల్లలకు రామ్ అంటే అభిమానం. వాళ్ళే నన్ను కూడా సినిమాకు లాక్కొచ్చారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచీ మా పిల్లలిద్దరూ ఒకటే గోల గోల చేస్తూ ఉన్నారు. ఆ హీరో ఏం చేసినా మా వాళ్ళకు బాగా నచ్చేలా ఉంది. బోలెడన్ని టెన్షన్స్‌లో ఉండే నేను మాత్రం మొదట్లో అంత ఆసక్తికరంగా సినిమాను చూడలేకపోయాను. కానీ ఆ తర్వాత నుంచీ నారాయణ మూర్తి నన్ను కట్టిపడేశాడు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులం అందరం కూడా అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాం. నాకు ఈ నారాయణమూర్తిని చూడగానే వాళ్ళలో చాలా మంది గుర్తొచ్చారు. ఇంకా చాలా విషయాలు గుర్తొచ్చాయి. నా ఆలోచనల్లో ఘర్షణ ప్రారంభమయింది. సినిమా చూసి ఇంటికి వెళ్ళాక కూడా ఆ నారాయణమూర్తి పాత్ర నన్ను వదిలిపెట్టలేదు. ఆ సినిమా గురించి మీడియా వాళ్ళు ఏం రాసి ఉంటారా అని చూశాను. అందరూ కూడా ఏవేవో పెద్ద పెద్ద పదాలు వాడుతూ, వాళ్ళ మేధాసంపత్తిని అంతా చూపిస్తూ సినిమా స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేశారనిపించింది. నారాయణ మూర్తి జీవితం, ఆయన చేసిన పోరాటం వాళ్ళకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. అందుకే ఆ నారాయణ మూర్తి ఎంత గొప్పవాడో…..నాకు ఎంతగా నచ్చాడో…..ఓ స్నేహితుడిలా ఆదర్శవంతమైన మంచి సలహా ఇచ్చి నాలో మార్పుకు ఎలా కారణమయ్యాడో మీకు చెప్పుకోవాలనిపించింది.

భారతదేశంలోనే ఒక నంబర్ వన్ ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడిని చూసినవాళ్ళందరూ ఏమనుకుంటారు? మనం కూడా ఆయనలా సంపాదించుకోవాలని ఆశపడేవాళ్ళు కొందరుంటారు. అబ్బ…ఏం వైభోగం రా అని ఇంకొంత మంది అనుకుంటారు? మరి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులందరూ… వాళ్ళ మనసులలో ఆ ధనవంతుడి గురించి ఏం అనుకుంటారు? ఎలా ఆలోచిస్తారు? ఆయన బాగుండాలని ఎంతమంది కోరుకుంటారు? ఆయనను మనసులోతుల్లో నుంచి గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు?

అదే నిజాయితీగా పనిచేస్తూ, తన దగ్గరకు పలు రకాల అవసరాలతో వచ్చే ప్రజలను ప్రేమగా పలకరిస్తూ పని చేసే ఓ ప్రభుత్వ ఉధ్యోగి గురించి ప్రజలు ఏమని ఆలోచిస్తారు? పనిని దైవంగా భావిస్తూ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తూ….పెద్దలకు ఓ నాలుగు మంచి మాటలు చెప్తూ ఊర్లో ఉన్న అందరికీ తలలో నాలుకలా ఉండే ఓ బడి పంతులు గురించి ఆ ఊరి జనం ఏమనుకుంటారు? వాళ్ళ గుండెలోతుల్లో ఆ మాష్టారి స్థానం ఏ స్థాయిలో ఉంటుంది? ఊరిలో ఎవరి చేతికి ఏ పంట అంది వచ్చినా, వాళ్ళ పొలంలో ఏ పండు పండినా ఆ టీచర్‌కి కూడా భాగం ఇస్తారు. తమ పిల్లలకు పాఠాలు చెప్తున్న మాష్టారిని కూడా ఇంట్లో సభ్యుడిలాగే చూస్తారు. ఊర్లో ఉన్న పదమందీ కలిసి ఏ పండగ జరుపుకుంటున్నా, ఏ ఉత్సవం చేసుకుంటున్నా మాష్టారి సలహాలు అడుగుతారు. ఆ ఉత్సవ సమయంలో కూడా ఆ ఉపాధ్యాయుడికి ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన భార్య, పిల్లలను కూడా ప్రేమగా చూస్తారు. నా ఊరి ప్రజలు కూడా నన్ను అలాగే చూశారు. కానీ వాళ్ళ అభిమానం నాకు అప్పుడు అర్థం కాలేదు. జీతం కోసమే పనిచేశాను. నలుగురికీ తెలియకుండా ప్రభుత్వ పాఠశాల సొమ్మును తినేశాను. కానీ ఆ సినిమాలో ఉన్న నారాయణమూర్తి పాత్రను చూశాక నాకు ఇక నిద్దర పట్టలేదు. నా ఆలోచనలు నన్ను నిద్రపోనివ్వలేదు. రామ్‌లాగే నా కొడుకు కూడా నన్ను ప్రేమించాలి, గౌరవించాలి అని అనుకున్నాను. ఊరి ప్రజల ముందు ఇన్ని రోజులూ నటిస్తూ బ్రతికేశాను. రేపటి నుంచి నాకు ఆ అవసరం లేదు. నలుగురికీ తెలియకుండా తప్పులు చేస్తూ, బయటికి నటిస్తూ బ్రతకను. ఇక పైన అలా బ్రతకలేను. నేను నాలా బ్రతుకుతాను. నారాయణమూర్తిలా బ్రతుకుతాను. నా గురించి నేను ఆలోచించుకునేలా చేసిన ఆ హైపర్ సినిమాకు, ముఖ్యంగా నా గురించే రాశారా అని నేను భావించేలా అత్యద్భుతంగా ఉన్న ఆ సినిమాలో ఉన్న మాటలకు, ఆ మాటలు రాసిన వాళ్ళకు కృతజ్ఙతాభివందనాలు.

ఇట్లు

నారాయణమూర్తిలా బ్రతకాలనుకుంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news