Uncategorizedశతమానం భవతి.....శతాధిక చిత్రాల కంటే బాగున్న సినిమా, మన సినిమా, మంచి...

శతమానం భవతి…..శతాధిక చిత్రాల కంటే బాగున్న సినిమా, మన సినిమా, మంచి సినిమా

నటీనటులుః శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ

మ్యూజిక్ః మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫిః సమీర్ రెడ్డి

ప్రొడ్యూసర్ః దిల్ రాజు

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ః సతీష్ వేగేశ్న

రిలీజ్ డేట్ః 14.01.2017

తెలుగు సినీ పరిశ్రమను గత కొన్ని దశాబ్ధాలుగా ఏలుతున్న ఇద్దరు టాప్ రేంజ్ స్టార్స్ నుంచి వస్తున్న రెండు ల్యాండ్ మార్క్ సినిమాలతో పాటు ఓ చిన్న స్థాయి సినిమాను రిలీజ్ చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి సినిమాల ప్రచార హోరులో శతమానం భవతి కనీసం వినిపిస్తుందా? దిల్ రాజు కాకుండా వేరే నిర్మాత అయి ఉంటే కనీసం థియేటర్స్ కూడా దొరికి ఉండేవి కాదు. అలాంటి పరిస్థితులను ఫేస్ చేయడానికి రెడీ అయ్యారంటేనే శతమానం భవతి సినిమాను దిల్ రాజు యూనిట్ అందరూ కూడా ఏ రేంజ్‌లో నమ్ముతున్నారో తెలుస్తోంది. అన్నింటికీ మించి సంక్రాంతి పండగ బ్యాక్ డ్రాప్‌లోనే తెరకెక్కిన శతమానం భవతిని సంక్రాంతి పండగ టైంలోనే ప్రేక్షకులకు చూపించాలన్న దిల్ రాజు సంకల్పం కూడా ఈ సినిమా రిలీజ్ అవడానికి కారణమైంది. మరి ఆ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్‌ని క్యాష్ చేసుకునేంత కంటెంట్ శతమనాం భవతిలో ఉందా? బొమ్మరిల్లు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి లవ్ స్టోరీని మిక్స్ చేసి తీయడంలో తాను ఎంత టాలెంటెడ్ అన్న విషయం నిరూపించుకున్నాడు దిల్ రాజు. మరి శతమానం భవతికి కూడా మరోసారి అదే మేజిక్‌ని రిపీట్ చేయగలిగాడా? డైరెక్టర్ సతీష్ వేగేశ్న, హీరో శర్వానంద్‌లకు హిట్ ఇచ్చేంత కంటెంట్ ఈ శతమానంలో ఉంది? పేరుకు తగ్గట్టుగానే వందరోజుల బొమ్మ అని చెప్పేంత విషయం ఉందా?

‘శతమానం భవతి’….టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లోనూ….అద్భుతమైన గ్రాఫిక్స్‌తోనూ ఉన్న సినిమా కాదు. పేరు మోసిన డైరెక్టరో లేకపోతే సినిమా అంతా కూడా తన డైరెక్షన్ ప్రతిభే కనిపించాలనుకున్న డైరెక్టరో తీసిన సినిమా కూడా కాదు. అలాగే తనకో ఇంట్రడక్షన్ సాంగ్, భయంకరమైన ఫైట్స్, బిల్డప్స్, తన డ్యాన్సులు చూపించుకోవడానికి సాంగ్స్ ఉండాలని కోరుకునే టాప్ రేంజ్ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో నటించలేదు. కామెడీ కోసం పిచ్చి పిచ్చి కామెడీ ట్రాక్స్ కూడా ఏమీ లేవు. కథ కూడా కొత్తది ఏం కాదు. మనం చాలా సార్లు చూసిందే. అయినప్పటికీ చూసిన వెంటనే సినిమా బాగానే ఉందే అని అనిపిస్తుంది. ఇందులో ఉన్న ఎమోషన్స్‌కి స్పందించేంత సెన్సిబిలిటీస్ మీకూ ఉంటే మాత్రం ఇలాంటి ‘మనవైన’ సినిమాలు కూడా రావాల్రా అని అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత……ఈ సినిమా తీసిన వాళ్ళు చెప్పిన ఏదో ఒక మంచి పని మనమూ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఇన్ని రకాలుగా మనలో స్పందనలు కలిగేలా చేసిన సినిమా మంచి సినిమా, బాగున్న సినిమా అవకుండా ఎలా ఉంటుంది.

కథ చెప్పడం రివ్యూ రైటర్‌కి ధర్మం కాదు. సినిమా చూడకుండా కథ తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా కోరుకోకూడదు. కానీ సినిమాలో చెప్పిన విషయమేంటో తెలుసుకుందాం. పిల్లలు ఫారెన్‌లో సెటిల్ అవ్వాలి, చాలా ఎత్తుకు ఎదిగిపోవాలి అని అనుక్షణం తపన పడిన తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్, జయసుధలు కోరుకున్నట్టుగానే వాళ్ళ పిల్లలందరూ ఎదిగిపోతారు. ఎంతలా అంటే వాళ్ళ కంటికి కనిపించనంత……పిల్లలను వీళ్ళు కళ్ళారా చూసుకోలేరు…..ఆ పిల్లలకు వీళ్ళను చూడాలన్న ధ్యాసే ఉండదు. సమాజం గురించి అవగాహన ఉన్న ప్రకాష్ రాజ్ సర్దుకుపోతూ ఉంటాడు. కానీ చిన్నప్పటి నుంచీ కూడా ఇళ్ళు, పిల్లలే ప్రపంచంగా ఉన్న జయసుధకు మాత్రం పిల్లలు దూరమవడంతో మనశ్శాంతి లేకుండా పోతుంది. అనుక్షణం పిల్లల గురించి తల్చుకుంటూ ప్రకాష్‌రాజ్‌కి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. మీ అమ్మకోసమైనా ఒకసారి ఊరికి రండ్రా అని పిల్లలను ఎన్నోసార్లు అడుగుతాడు ప్రకాష్ రాజ్. కానీ వాళ్ళు రారు. ఆ పిల్లలను రప్పించడం కోసం….జయసుధ అయినా హ్యాపీగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో అత్యంత బాధాకరమైన కఠిన నిర్ణయాన్ని తీసుకుంటాడు ప్రకాష్ రాజ్. ఆ నిర్ణయం ఏంటి? తల్లిదండ్రులను చూడడానికి ఎప్పుడూ రాని పిల్లలు ప్రకాష్ రాజ్ నిర్ణయం తెలుసుకుని ఆందోళనగా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళను అంతగా కదిలించిన నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం పర్యావసానాలు ఏంటి అన్నదే ఈ కథ. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ల ప్రేమకథ ఈ సినిమాను రెండు గంటల పాటు ఆనందంగా చూడడానికి అవసరమైన ఉపకథ. మనదైన మన సమాజానికి, మనల్ని చూస్తూ పెరిగే భవిష్యత్తరాల గురించి కూడా ఈ సినిమాలో ఏం చెప్పారో అదే ‘శతమానం భవతి’.

ఈ సినిమాలో చాలా బాగా నటించినవాళ్ళు ముగ్గురు. ప్రకాష్ రాజ్, శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్. ముగ్గురూ కూడా నటించడమో, సొంత వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్‌లోకి జొప్పించడమో చేయకుండా జీవించారు. అంతలా క్యారెక్టర్స్‌ని ఓన్ చేసుకున్నారు. జయసుధతో సహా ఇక మిగతా ఆర్టిస్ట్స్ చాలా మంది కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. కానీ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాల్లో అలాంటి తప్పిదాలు జరగడం కామనే. డ్రామా అంతా కూడా ఎక్కువ భాగం శర్వా, అనుపమా, ప్రకాష్ రాజ్‌లపైనే ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జయసుధ కూడా కొన్ని సీన్స్‌లో మాత్రం ఓవర్ యాక్షన్ చేసింది. మిగతా అన్ని సీన్స్ కూడా ఒకె. నరేష్, ప్రవీణ్‌ల కామెడీ నవ్వించింది.

శతమానం భవతిలాంటి సినిమాలకు మ్యూజిక్ ప్రాణం పోయాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మిక్కీ జె మేయర్‌ పనికి మంచి మార్కులే పడతాయి గానీ సాంగ్స్ విషయంలో మాత్రం యావరేజ్ అనిపిస్తాడు. మిగతా టెక్నీషియన్స్ అందరికంటే కూడా డైరెక్టర్ రాసుకున్న డైలాగ్సే చాలా బాగున్నాయి. టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలన్న ప్రయత్నం కాకుండా…..తను చూపించదల్చుకున్న ఎమోషన్స్‌ని, చెప్పదల్చుకున్న విషయాన్ని మాత్రం అద్భుతంగా చెప్పేశాడు. సినిమాలో ఉన్న చాలా బలహీనతలను కవర్ చేసిన అంశం కూడా అదే.

పిల్లలు చాలా చాలా ఎత్తుకు ఎదిగిపోవాలని తమ శక్తియుక్తులన్నీ ధారపోసే కన్నవాళ్ళు….చివరికి అదే పిల్లలు తమకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతే…కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతే జీవితం చరమాంకంలో ఎలా బ్రతుకుతున్నారు? శతమానం భవతి అని అందరూ ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ పిల్లలు, మనవళ్ళకు దూరంగా వందేళ్ళు బ్రతకాల్సిన అవసరం ఏముంది? అలాంటి బ్రతుకులో ఆనందం ఏముంటుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. సినిమా అంతా ఈ విషయం చుట్టూనే తిరుగుతుంది. కానీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా….అందంగా, ఆహ్లాదపరిచే సన్నివేశాలతో….అంతకంటే కూడా అద్భుతమైన మాటలతో చాలా చాలా బాగుంది సినిమా. ఈ రోజు మనకు గానీ, మన పిల్లలకు గానీ ఇలాంటి విషయాలు చెప్పడానికి అమ్మమ్మలు, తాతయ్యలు లేరు. ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు ఎన్నో మంచి విషయాలు చెప్పిన ఈ శతమానం భవతికి కచ్చితంగా వెళ్ళొచ్చు. రెండు గంటలపాటు నవ్వుకోవచ్చు…మదిలో ఉన్న ఎన్నో గుర్తులను గుర్తు చేసుకుని మరోసారి అనుభూతి చెందొచ్చు. ఇకపైన ఇంకా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలనే కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకుని బయటకు రావొచ్చు. కొన్ని విషయాలను అయినా మనం కూడా ఫాలో అవ్వొచ్చు.

ఫైనల్ వర్డ్ః సినిమాటిక్ లోపాల గురించి ఎందుకు? చెప్పిన విషయం బాగుంది. కామెడీ నవ్వించింది. ఎమోషన్స్ కంటనీరు పెట్టించాయి. చెప్పిన మంచి విషయాలు మన జీవితాలను మరింత అందంగా, ఆనందంగా తయారు చేసుకోవడానికి పనికొచ్చేలా ఉన్నాయి. సంక్రాంతి సమయంలో ఇంటిల్లిపాది కలిసి చూడాల్సిన సినిమా…..‘శతమానం భవతి’.

రేటింగ్ః 3.25/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news