Reviews‘ఖైదీ నెంబర్ 150’ సినిమాపై సమగ్ర విశ్లేషణ.. తొమ్మిదేళ్ల దాహం తీర్చిన...

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాపై సమగ్ర విశ్లేషణ.. తొమ్మిదేళ్ల దాహం తీర్చిన మెగాస్టార్

Exclusive Analysis on Megastar Chiranjeevi’s Khaidi No 150 movie which is released on January 11th with huge expectations. VV Vinayak directed this movie under ram charan production.

సినిమా : ఖైదీ నంబర్‌ 150
నటీనటులు : చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, రాయ్‌ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, తదితరులు
దర్శకత్వం : వి.వి.వినాయక్‌
నిర్మాత : రామ్‌చరణ్‌
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ : రత్నవేలు

మాటలు : పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి

బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
కథ: మురుగదాస్‌

విడుదల తేదీ : 11-01-2017

ఒకప్పుడు రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన మెగాస్టార్‌గా చిరంజీవి.. తొమ్మిదేళ్ల తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీఎంట్రీ ఇస్తుండడంతో దానిపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పైగా.. ఇది ఆయన మైల్‌స్టోన్ 150వ చిత్రం కావడంతో మరింత క్రేజ్ వచ్చిపడింది. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేలా తన సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా రీఎంట్రీ ఇస్తారన్న నమ్మంతో.. ఈ మూవీకోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియెన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి.. వారి అంచనాల్ని అందుకోవడంలో చిరు సక్సెస్ అయ్యారా? లేదా? పదండి తెలుసుకుందాం..

కథ :
కోల్ కతా సెంట్రల్ జైల్లో ఖైదీ అయిన కత్తి శీను (చిరంజీవి).. చాలా చాక్యంగా అక్కడినుంచి తప్పించుకుని హైదరాబాద్‌కి వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లే సమయంలో ల‌క్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. దాంతో.. బ్యాంకాక్‌ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని.. సిటీలోనే ఉండిపోతాడు.

కట్ చేస్తే.. ఓ గ్రామంలో ఓ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న కార్పొరేట్ సంస్థల అధిపతి (అగర్వాల్) తరుణ్ అరోరా, ఆ ఊరిలోని రైతుల భూముల లాక్కోవాలని ప్రయత్నిస్తాడు. అయితే.. శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం) వారికి వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం మొదలుపెడతాడు. ఓ సమయంలో శంకర్‌పై హత్యాయత్నం జరుగుతుంది. అక్కడే ఉన్న కత్తి శీను.. తన పోలికలతోనే ఉన్న శంకర్‌ని చూసి ఖంగుతింటాడు. అతడ్ని కాపాడి, ఆసుపత్రిలో చేరుస్తాడు. కత్తిశీను మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలో.. అతనిని శంకర్‌గా భావించిన కలెక్టర్, అతడ్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. అగర్వాల్ కూడా అతడ్ని చూసి శంకర్‌గా భావిస్తాడు. తనకు అడ్డుగా ఎక్కడ నిలబడతాడోనని ఉద్దేశంతో.. అతనితో ఓ బేరం కుదుర్చుకుంటాడు. అందుకు సరేనని శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను ఒప్పుకుంటాడు.

కట్ చేస్తే.. శంకర్ కోసం ఓ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అప్పుడు కత్తి శీనుకి అతని పూర్వాపరాలు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. దాంతో.. కత్తిశీను తన మనసు మార్చుకుని, రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని పూనుకుంటాడు. దీంతో.. అగర్వాల్, శీనుకి మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రకి చెక్ చెప్పేందుకు శీను వేసిన ఎత్తుగడలు ఏమిటి? అవి ఫలించాయా? వాటిని ఎదుర్కొనేందుకు అగర్వాల్ చేసిన ప్రయత్నాలేంటి? ఇంతకీ శంకర్ ఏమయ్యాడు? చివరికి ఏమైంది? అనే ఆసక్తికరమైన అంశాలతో సినిమా సాగుతుంది.

విశ్లేషణ : 
తమిళ ‘కత్తి’కి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని.. తెలుగు నేటివిటీకి అనుకూలంగా మార్పులు, చేర్పులు చేసి రూపొందించారు. చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగానే చిత్రీకరించారు. మొదట్లో కథ రొటీన్‌గా, కాస్త స్లోగా సాగుతుంది కానీ.. శంకర్ ఎంట్రీతో వేగం పుంజుకుంటుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరిగింది? అతనికి, విలన్‌కి మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది? అన్న అంశాల చుట్టూ కథని చాలా ఆసక్తికరంగా నడిపించాడు వివి వినాయక్.

ఓవైపు కథనం వేగంగా సాగుతుండగానే.. మరోవైపు అలరించే పాటలూ, కామెడీ పంచ్‌లు వినోదాన్ని పంచుతాయి. అలాగే.. రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే విధంగా తెరకెక్కించిన సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి. చిరు ఇమేజ్‌కి తగినట్లుగా పాటల్నీ, ఫైట్స్‌ని తెరకెక్కించారు. ‘అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ’ పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. ఈ పాట థియేటర్లలో కుర్రకారుతో ఈలలు వేయిస్తుంది. ‘రత్తాలూ..’, ‘సుందరి’ పాటలు హుషారెక్కిస్తాయి. ‘యూ అండ్ మీ’ పాట చాలా మెలోడియస్‌గా ఉంది. కాయిన్ ఫైట్‌ని మాతృకకి ఏమాత్రం తీసిపోకుండా వినాయక్ చాలా బాగా తీశాడు.

చిరు, కాజల్‌కి మధ్య నడిచే రొమాంటిక్ ఫర్వాలేదు. కొన్ని సీన్లు రొటీన్‌గా ఉండడంతో.. బోర్‌గా అనిపిస్తుంది. ఇంకొన్ని సన్నివేశాలు అంచనాలకు తగ్గట్టుగా పండకపోవడంతో.. ఆడియెన్స్ నిరాశకు గురవుతారు. విలన్ క్యారెక్టర్ ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్. హీరోకి ధీటుగా విలనిజాన్ని తరుణ్ అరోరా పండించలేకపోయాడు. కొన్నిచోట్ల కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కథనాన్ని నడిపించడంతో.. ఆయన తప్ప మరేం హైలైట్ అవ్వలేదు.

నటీనటుల పనితీరు :
తొమ్మిదేళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవిలో ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. పూర్వవైభవాన్ని ఇందులోనూ ప్రదర్శించి ఆడియెన్స్‌ని కట్టి పడేశాడు. తన నటనతో కత్తిశీను, శంకర్ పాత్రల్ని బాగా పండించారు. డ్యాన్స్, యాక్షన్‌లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన కాజల్ అందంతో కట్టిపడేసింది. అయితే.. ఈమెది చెప్పుకోదగిన పాత్రయితే కాదు. ఏదో పాటల కోసం ఇలా వచ్చి, అలా వెళ్లిపోతుంది. తరుణ్ అరోరా విలన్‌గా మెప్పించలేకపోయాడు. పసలేని నటనతో ప్రేక్షకుల్ని నిరాశపరిచాడు. బ్రహ్మానందం, ఆలీ, ఇతర కమెడియన్ నవ్వించడానికి బాగా ప్రయత్నించారు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధి బాగానే నటించారు.

సాంకేతిక పనితీరు :
రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని గ్రాండ్‌గా చూపిస్తూ.. హీరోని ఎలివేట్ చేస్తూ చూపించిన అతని కెమెరా పనితనాన్ని మెచ్చుకోవచ్చు. దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్, రామ్ చరణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక వినాయక్ విషయానికొస్తే.. చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్టోరీని బాగానే మలిచాడు. కానీ.. మధ్యలో కొన్ని లోపాల్ని సరిచూసుకుని ఉండుంటే బాగుండేది. వినాయక్ పనితనం కంటే మెగాస్టార్ చరిష్మానే హైలైట్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్ :
చిరంజీవి
కథ-కథనం
పాటలు
డ్యాన్సులు
ఉద్వేగభరిత సన్నివేశాలు

యాక్షన్

మైనస్ పాయింట్స్ :
బలమైన విలన్ పాత్ర లేకపోవటం

మాతృకలో కొన్ని సీన్లు లేకపోవడం
రొటీన్ సన్నివేశాలు

ఫైనల్ వర్డ్ : అభిమానులకు ‘మెగా’ కానుక.
రేటింగ్ : 3.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news